Pages

Saturday, November 21, 2009

ఫైర్ఫాక్స్ తెలుగు వాడుకర్ల గణాంకాలు




ఫైర్ఫాక్స్ తెలుగు విడుదలై సంవత్సరం గడిచింది. 2009-11-17 వారానికి వాడుకర్ల గణాంకాలను పటంలో చూడండి.

మొత్తం వాడుకర్లు 2194 కాగా, దాదాపు 70 శాతం మంది భారత్ నుండి, అమెరికా నుండి 20 శాతం వున్నారు.
ఫైర్ఫాక్స్ లో బ్లాక్ లిస్ట్ అనే లక్షణం ద్వారా ఇవి సేకరించబడ్డాయి. దాదాపు 500 మంది వారానికి, ఫైర్ఫాక్స్ తెలుగు దించుకుంటున్నారు(downloads).
కంప్యూటర్ వాడే ప్రతి ఒక్కరు తప్పని సరిగా విహరిణి వాడతారు కాబట్టి, ఈ గణాంకాల్ని తెలుగులో కంప్యూటర్ వాడేవారి సంఖ్యకు సారూప్యంగా వాడుకోవచ్చు.

Sunday, October 11, 2009

మొదటి తెలుగు వికీ అకాడమీ (6 అక్టోబరు 2009, చీరాల) పై నివేదిక


మొదటి తెలుగు వికీ అకాడమీ, 6 అక్టోబరు 2009న చీరాల ఇంజినీరింగు కాలేజీ, చీరాలలో విజయవంతంగా జరిగింది. దీనిలో 120 మందికి పైగా మూడవ, చివరి సంవత్సరం విద్యార్ధులు పాల్గొన్నారు. 3 గంటలు పాటు తెవికీ పరిచయం, కంప్యూటరులో తెలుగు టైపు చేయు పద్ధతులను, తెలుగుకి కంప్యూటరును అనువుగా చేయడం, తెవికీ మూల స్థంభాలు, వ్యాసాలు మార్పు చేయడం, కొత్తవి రాయడం తెలుసుకొన్నారు. అందులోఒకటిన్నర గంటలసేపు కంప్యూటరుపై ప్రయత్నించి నేర్చుకున్నారు. ఈ సందర్భంగా, తెవికీ కరపత్రాన్ని పంచడం జరిగింది.

చాలా మంది, ఒకేసారి వికీపీడియా వాడటంతో, కొన్ని ఇబ్బందులు ఎదురయినవి. వాటిలో ముఖ్యమైనవి.
౧) ఆరు ఎకౌంట్లు కంటే ఎక్కువ మందిని వికీపీడియా లాగిన్ అవనివ్వలేదు. అందువలన, అనామకంగానే పని చేయమని చెప్పవలసివచ్చింది.
౨) తెలుగు భాషని అమర్చుకోవడానికి, సాఫ్టువేర్ స్థాపించన తరువాత మరల బూట్ చేయమంని అడుగుతుంది. కాని లాబ్ నియమాల ప్రకారం, మరల బూట్ చేసినపుడు, అ సాఫ్టువేర్ తొలగించి, సాధారణ స్థితిలో వుంచబడుతుంది. అందువలన, తెవికీ ఉచ్ఛారణ కీ బోర్డు మాత్రమే వాడమని చెప్పవలసి వచ్చింది.

వాటిని సరిచేసుకుంటే, ముందు ముందు మరింత నాణ్యతతో ఈ కార్యక్రమాలు నిర్వహించటానికి వీలవుతుంది.

ఈ కార్యక్రమాన్ని మొదట బెంగుళూరులో నిర్వహిద్దాని అనుకున్నా, నేను మా ఊరు దేవరపల్లి ఇటీవలి సెలవులకి వెళ్లడంతో, చీరాల ఇంజినీరింగు కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ కమాలుద్దీన్ తో మాట్లాడితే, ఆయన వెంటనే సరే అనడంతో, చీరాలలో నిర్వహించడం జరిగింది.
దీనికి ముందు విద్యార్ధులకి అసక్తి కలిగించడంకోసం, "స్వేచ్ఛా మూలాల ద్వారా విద్యార్ధుల నేర్పరితనం అభివృద్ధి చేయటం" (ఇంగ్లీషులో) Developing Student Skills through open source) " అనే దానిపై ఉపన్యాసం ఇచ్చాను. ఈ అవకాశం కల్పించిన చీరాల ఇంజినీరింగు కాలేజీ యాజమాన్యము, సిబ్బంది మరియు విద్యార్ధులకు కృతజ్ఞతలు.

Sunday, September 27, 2009

ఇండికీస్ ; ఇన్ స్క్రిప్ట్ తెలుగు అక్షర మీటకాల అతుకులు


చాలాకాలం క్రిందట ఇన్ స్క్రిప్ట్ తెలుగు వాడటానికి ప్రయత్నించి అన్ని అక్షరాలను సులభంగా గుర్తుపెట్టుకొనలేక పోతన కీ బోర్డు వాడటం మొదలెట్టాసు.
ఇన్ స్క్రిప్ట్ తెలుగులో ఒక్క క అక్షరము తప్ప ఏది ఇంగ్లీషు అక్షరా ఉచ్చారణకి దగ్గర లేదు. పోతనలో నాలుగైదు అక్షరాలు మినహా అన్నీ దగ్గరగా వుంటాయి.

ఇప్పుడు తెలుగు వికీపీడియా వ్యాప్తికి, అన్ని కంప్యూటర్లలో వాడగలది, భారత ప్రభుత్వంచే ప్రామాణికమైసదైనటువంటిది అయిన ఇన్ స్క్రిప్ట్ ని వాడటానికి ప్రయత్నించాను.
దానికోసం తెలుగు అక్షర మీటకాల అతుకులు తయారు చేశాను.
ఒక వైపు గమ్ము పూసిన పేపరు పై ముద్రించి ముక్కలుగా కత్తిరించితే మా అమ్మాయి చకాచకా వాటిని అంటించింది. ఇక తెలుగు కీ బోర్డు తయ్యార్.
అది వాడి ఈ బ్లాగాంశం రాశాను. పోతనకి అలవాటుబడిన చేతులు మొరాయిస్తుంటే ఇది రాయటానికి ౪౦ (40) నిముషాలు పట్టింది. అంటే 101 పదాలతో 777 అక్షరాలు రాయగా వేగం గంటకి ౦.౩కిలోబైట్లు.
తెలుగు అక్షర మీటకాల అతుకులు ఎవరైనా సులభంగా తయారు చేసుకోవచ్చు. త్వరలో మరంత మెరుగుపరిచి అందరికి అందచేయాలని ప్రయత్నిస్తున్నాను.

Saturday, August 15, 2009

వికీపీడియా అకాడమీ

అకాడమీ అంటే మీకేమనిపిస్తోంది? ఎదో ఒక రంగము అభివృద్ధికి కృషి చేసే సమూహాలు గర్తుకి వస్తున్నాయా లేదా? తెలుగు అకాడమీ, సంగీత నాటక అకాడమీ లాంటివి. అలాగే వికీపీడియా అకాడమీ, వికీ పీడియా అభివృద్ధికి కృషి చేస్తుంది. వికీపీడియాని చాలా మంది చదవడానికి మాత్రమే వాడుతున్నారు. దానిలో ఎవరైనా సమాచారం చేర్చవచ్చని ఎంతమందికి తెలుసు. తెలిసినా ఎంతమంది చేస్తున్నారు.తెలుగు మరి ఇతర భారతీయ భాషలలో వ్యాసాలు తక్కువగా వుండటానికి చాలా అటంకాలు వున్నప్పటికి, వికీపీడియా గురించి, దానిలో సమాచారం ఎలా చేర్చవచ్చో తెలియక పోవడమే పెద్ద ఆటంకం. దానిని తొలగించటానికి ఉద్దేశించిందే వికీపీడియా అకాడమీ.

పనిచేసే విధానం.
వికీపీడియా అకాడమీ అంటే పెద్ద భవనాలున్న సంస్థ అనుకోకండి. కనీసం ఒక కంప్యూటరు, నెట్వర్క్ అనుసంధానసదుపాయం వున్న చోట, వికీపీడియా గురించి తెలియని వారికి, తెలియచెప్పటమే ఈ అకాడమీ పని. తెలుగు ఎలా టైపు చేయాలో, వికీపీడియాలో మార్పులు ఎలా చేయాలో చెప్పటము, వారితో చేయించటం. కొత్త వ్యాసాలు మొదలెట్టటము, లేక పాత వ్యాసాల నాణ్యత పెంచడము , ఎవైనా సందేహాలుంటే తీర్చడము లాంటి పనులు చేస్తే సరిపోతుంది. వీటికి కావలసిన సమాచారం అంతా తెలుగు వికీపీడియా నివాస పేజీలోని స్వాగతం విభాగంలో వుంది మరి. కాకపోతే దీనిని, ప్రజంటేషను శైలికి మార్చితే అందరికీ బాగా సౌలభ్యంగా వుంటుంది.

ఇంకెందుకు ఆలస్యం.
మీ దగ్గరిలో వున్న మీ మిత్రునికి చెప్పి వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.

మరింత తెలుసుకోండి.
చెన్నయిలో వికీపీడియా అకాడమీ గురించి వార్త

Saturday, August 1, 2009

తెలుగు వికీ వ్యాసం సృష్టి వేగం



తెలుగుని కంప్యూటర్లో టైపు చేయడానికి రకరకాల కీ బోర్డులు, మాపింగులు వాడకంలో వున్నాయి. వీటిలో ఏది మంచిది అనే ప్రశ్న సహజంగా వస్తుంది. ఇన్స్క్రిప్ట్ ఎక్కువ వాడకంలో వున్నా, చాలా మంది మిగతా రకాలు వాడుతున్నారు. శాస్త్రీయపరంగా పరిశీలించటానికి అవసరమైన టైపింగు పరీక్షలు ఇప్పుడు వాడకంలొ లేవు కాబట్టి, తెలుగు వికీ వ్యాసం సృష్టి వేగం అనే పద్దతి వాడితే, వ్యక్తిగతంగా తెలుగు టైపింగు మెరుగు అవతున్నది తెలుసుకోవటానికి, ఇతర పద్ధతులు వాడే వారితో పోల్చుకోడానికి ఉపయోగంగా వుంటుంది.

దీనికి కనీసం గంట సేపు ఒక కొత్త వ్యాసం లేక వ్యాసాలు తయారు చేయాలి. ఆ వ్యాసాల పరిమాణాన్ని ( బైట్లులో) తెలుసుకుంటే, అదే మనయొక్క వ్యాస వేగం అవుతుంది.
నేను పోతన కీ బోర్డు మాపింగుతో ప్రయత్నించితే నా వేగం 7353 అని తేలింది.
వ్యాసానికి ఇంగ్లీషు మూలం అయి వుంటే బాగుంటుంది. తెలుగు వ్యాసంలో ఇంగ్లీషు పారాలులేక ఎక్కువ వాక్యాలు వుండకూడదు.
మీరీ విధంగా ప్రయత్నించి, మీ కీ బోర్డు వివరంతో, మీ తెలుగువికీ వ్యాస వేగం వ్యాఖ్యలరూపంలో రాయండి.

Thursday, April 30, 2009

ఫైర్ ఫాక్స్ 3.5 బీటా 4 విడుదల

గెకో 1.9.1 రూపలావణ్య ప్లాట్ఫార్మ్ మీద ఆధారపడిన ఫైర్ ఫాక్స్ 3.5 బీటా 4 27 ఏప్రిల్ 2009 న విడుదల అయ్యింది. ఇదే 3.5 విడుదలకి చివరి బీటా. ఈ విడుదల ఇంతకు ముందు విడుదల కంటే, చాలా కొత్త లక్షణాలను కలిగి వుంది. కొత్త వెబ్ సాంకేతికాలు, మెరుగైన పనితీరు, సులభమైన వాడుక కలిగి వుంది.
*ఇది 70 భాషలలో దొరుకుతుంది. మీ స్థానిక భాషలో తెచ్చుకోండి.
*గోప్య వివరాలను నియంత్రించడానికి కొత్త సాధనాలను కలిగివుంది. గోప్య వీక్షణపద్ధతి కూడా వుంది.
*కొత్త ట్రేస్ మంకీ జావాస్క్రిప్ట్ ఇంజిన్ వలన మరింత స్థిరత్వం మరియు మెరుగైన పనితీరు
* జియోలొకేషన్ వెబ్ ప్రమాణికాలకు అనుగుణంగా మీ స్థలము గుర్తెరిగిన విహరిణిగా పనిచేయగలదు.
*స్థానిక జెసన్ (JSON) మరియు వెబ్ వర్కర్ థ్రెడ్ లు
*గెకో రూపలావణ్య ఇంజిన్ కు మెరుగులైన, ఊహానుగత పార్శింగ్ వలన మీ వెబ్ పేజీలు త్వరగా కనపడతాయి.
*కొత్త వెబ్ సాంకేతికాలైన HTML5 వీడియో, ఆడియో, ఫాంట్లు దిగుమతి, కొత్త CSS లక్షణాలు, జావాస్క్రిప్ట్ ప్రశ్న ఎంచుకోవటం, అనువర్తనాలకు, స్థానిక కంప్యూటర్ పై సమాచారాన్ని భద్ర పరుచుకనే ( నెట్వర్క్ తో సంపర్కము లేకుండా) సౌకర్యం (HTML5), SVG మార్పుడులు
దీనికి స్థిరత్వం కలదు కాని, ఇది అభివృద్ధికారులకు, పరీక్షాపరులకు ఉద్దేశించబడింది.

Sunday, April 12, 2009

తెలుగు అక్షర రూప సమస్య (కా+ష్= క్షా)

లినక్స్ లో తెలుగు అక్షర రూప సమస్యలు నిర్మూలన ఐనవనుకుంటుంటే, ఇటీవలే ఇంకొకటి కనబడింది. వికీపీడియా చదువుతూ లోక్ సత్తా గురించిన పేజీకి వెళితే, అక్కడ జయప్రక్షా అని కనపడింది. పొరపాటుగా తప్పు చేయబడిందని సరిచేయపోతే, ఈ సమస్య వెలుగులోకివచ్చింది. క్ ష ని మాత్రమే కలిపిచూపించవలసిన కోడ్ కా వచ్చిన తరువాత కూడా ష వస్తే కలుపుతున్నది. ఇది ఫాంటులో దోషమా లేక రూపుదిద్దు అనువర్తనములో (pango) లో సమస్య తెలుసుకోవడానికి ప్రయత్నించాను. పోతన 2000 ఖతితో కూడా ఈ సమస్య కనబడటంతో, బహుశా, పాంగోలో దోషం వుండివుంటుంది.

Friday, January 30, 2009

లినక్స్ తెలుగు వాడుకరుల కొక క్రొత్త గూగుల్ గ్రూపు linux-telugu-users


లినక్స్ తెలుగులో వాడేవారు చాలా తక్కువ అని గత రెండు సంవత్సారాలుగా తెలుగు కంప్యూటర్ రంగాన్ని గమనిస్తున్న నాకు తెలిసింది. తెలుగుబ్లాగులో ఉన్న దాదాపు 1850 మందిలో ఏ పదిమంది లినక్స్ వాడుతున్నారనుకుంటాను. భారతదేశంలో తెలుగు కంప్యూటర్లో వాడకం భవిష్యత్తులో పెరగడానికి, ఏ మాత్రం ఖర్చులేని, కాపీరైటు హక్కులు ఉల్లంఘన అవసరంలేని లినక్స్ సరి అని నేను భావిస్తాను. దీనికి తోడ్పడటానికి ఒక మెయిలింగు లిస్టు అవసరమనిపించింది. ఇప్పటివరకే ప్రాచుర్యంలో కల లిస్టులు అనగా indlinux-telugu ముఖ్యంగా అభివృధ్దికారులకొరకు ఉపయోగించబడుతున్నాయి. వాడుకరులకు ప్రత్యేకించి లిస్టులు లేవు. అందుకని ఒక క్రొత్త గ్రూపు తయారు చేశాను. linux-telugu-users
దీనిలో సభ్యులుగా చేరమని, ప్రస్తుత లినక్స్ వాడుకరులకు, ఆసక్తికలవారికి ఇదే నా ఆహ్వానం.