Pages

Sunday, October 30, 2011

శామ్సంగ్ గేలక్సీ ఏస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో తెలుగు


From TeluguWikipediaOnSamsungAceSmartPhone


దాదాపు 15 నెలల క్రిందట ఐఫోన్ లో తెలుగు  విషయమై బ్లాగ్ రాశాను. అప్పటినుండి తక్కువ ధరలో తెలుగు వెబ్ పేజీలు చూపించగల మొబైల్ ఫోన్ అన్వేషణ జరుగుతూనే వుంది. నోకియా హిందీ ఫోన్ ని విడుదలచేసింది అయితే తెలుగు ఇతర భాషల విడుదలను పక్కకు పెట్టింది. ఇటీవల మొబైల్ స్టోర్ లో క్రియాశీలమైన ఫోన్ పరిశీలించగా శామ్సంగ్  ఏస్ లో తెలుగు చాలా వరకు బాగా కనబడింది. ఇంకేముంది అంత  తక్కువధరకు కాకపోయినా నా అన్వేషణ ఫలించింది. ఏస్ ని కొని వాడటం పరిశీలించాను. తెలుగు చాలావరకు దోషాలు లేకుండా వుంది. ఉదాహరణకు 'టి' లో గుడి   సరియైన స్థానంలో రావటంలేదు. కాని తెలుగు భాషలో ఉత్తరాలు అవీ చూడటానికి చక్కగా వుంది.  గూగుల్ భాషపరికరాలు వాడి,  గ్యాన్పాడ్ ద్వారా గూగుల్ లిప్యంతరీకరణం లేక ఇన్స్క్రిప్ట్ వాడి తెలుగు టైప్ చేయడం కూడా వీలవుతుంది. ఇక తెలుగు టైపింగ్ కు  ప్రామాణిక  కీబోర్డు నమూనా రూపొందితే పూర్తి తెలుగు లో పోన్ వాడటం సాధ్యపడుతుంది. ఈ విషయమై ఐఇఇఇ (ఇంజనీర్ల వృత్తిపర సంస్థ) ద్వారా పని జరుగుతున్నది.

Saturday, April 30, 2011

ఉబుంటు వాడుకరి మార్గదర్శని: తెలుగులో ప్రారంభం నుండి ముగింపు దాక

 ఉబుంటు వాడుకరి మార్గదర్శని నుండి
ఉబుంటు 11.04 28 ఏప్రిల్ 2011 న విడుదలైంది. ఉబుంటు ఒక స్వేచ్ఛాబహిరంగ మూలాల లినక్స్ పంపకం. విండోస్ లాంటిది కొనుక్కొనవలసి వుండగా ఇది ఉచితంగా లభ్యమవుతుంది. దీనిలో మీకు కావలసినఅనువర్తనాలన్నీ (చలనచిత్ర ప్లేయర్, సత్వర సందేశిని, కార్యాలయ సాఫ్ట్వేర్, ఆటలు) అన్నీ ఉచితం. మూలాలు అందుబాటులో వున్నందున, దీనిలో మార్పులు చేయటానికి ఎవరైనా సహకరించవచ్చు. కార్యాలయాలలో వాడాలంటే కెనానికల్ సంస్థ మరియు ఇతర సంస్థల తోడ్పాటు కొనుక్కోవచ్చు. ఉచితంగా వాడాలన్నా మీ తోటి వాడుకరుల మెయిలింగ్ లిస్టులు, వెబ్సైట్లు ద్వారా సహాయపడుతుంటారు.



ఈ విడుదలలో ఒక కొత్తరకం అంతర్వర్తి పరిచయం అవుతుండగా, తెలుగు తోడ్పాటు ప్రారంభం నుండి (డివిడి ప్రవేశపెట్టి బూట్ చేయడం నుండి) ముగింపు వరకు వుండటం ప్రథమం.   బహుశా డిబియన్ మరియు డెబియన్ ఆధారిత పంపకాలను తప్పించి మిగతా లినక్స్ పంపకాలలో లేదనుకుంటాను. ఇక ఇప్పుడు ఇంగ్లీషు అంతగా రాని పిల్లలు, పెద్దలు, అందరూ దర్జాగా కంప్యూటర్ వాడవచ్చు. తెలుగుతో పాటు కన్నడం కూడా తోడ్పాటు లభించటంతో  ఇప్పుడు భారతదేశ భాషలలో పది భాషలలో అందుబాటులోకి వచ్చింది.

ఉబుంటు విడుదలలో బహుళ స్పర్శ సాంకేతిక సౌలభ్యం వుంది. అంటే మౌస్ తో వాడుకోవటం పాతబడే రోజులు దగ్గరయ్యాయి. చేతి వేళ్లతో రకరకాల పనులు చేయవచ్చు. దీనికి కావలసిన ట్రాక్ పాడ్ కొత్తగా వచ్చే  లాప్టాప్, నెట్బుక్, టాబ్లెట్ లలో లభ్యమవుతుంది. బ్లూటూత్ సౌకర్యం వున్న లాప్టాప్ వాడుకరులు యాపిల్ ట్రాక్ పాడ్ కొనుక్కొని ఈ కొత్త సౌలభ్యాన్ని  ఉపయోగించుకోవచ్చు.

దాదాపు పది ఏళ్ల నుండి తెలుగు స్థానికీకరణం గురించి జరుగుతున్న కృషికి ఇదొక మైలు రాయు. 2005 లో తెలుగు తోడ్పాటు మొదలైనా, ఫైర్ఫాక్స్, నాణ్యత గల తెలుగు కార్యాలయ సాఫ్ట్వేర్ (లిబ్రెఆఫీస్) లభ్యం కావటానికి ఇంత సమయం పట్టింది. మీరు ఇప్పటికే విండోస్ వాడుతున్నా, దీనిని రెండవ నిర్వహణ వ్యవస్థగా లేక దానిపై అనువర్తనంలాగా వాడటానికి అవకాశముంది.

ఎలెక్ట్రానిక్ పుస్తకం
దీనిని గురించి తెలుగులో తెలుగు తెరపట్టులతో (screenshots) తో సులభంగా అర్థమయ్యే రీతిలో  ఎలెక్ట్రానిక్ పుస్తకం తయారు చేసి అందుబాటులోకి తేవడమైనది.  దీని ప్రత్యేకత ఏమిటంటే దీనిని తయారు చేయటానికి పూర్తిగా స్వేచ్ఛాబహిరంగ మూలాల సాఫ్ట్వేర్( ఉబుంటులోనిదే)  వాడబడింది. ఆలాగే దీని మూలాలు వికీబుక్స్ లో రాయబడ్డాయి.  ఇవన్నీ స్వేచ్ఛానకలుహక్కులు పరిమితులు CC-BY-SA-3.0 క్రింద లభ్యమవుతాయి. అందుకని మీరు దీనిని ఉచితంగా పొందవచ్చు, ఇతరులతో పంచుకోవచ్చు.  దీనిని మీరు ఎలెక్ట్రానిక్ రూపంలో చదువుకోవచ్చు లేకపోతే అడోబ్ రీడర్ తో బుక్ లెట్ రూపంలో  మీ ప్రింటర్ పై ముద్రించుకొని మధ్యలో పిన్ను చేసుకుంటే భౌతిక పుస్తకం లాగా చదువుకోవచ్చు. ఇక దీని మూలాలు వికీబుక్స్ లో వున్నాయి కాబట్టి మీరు ఇంటర్నెట్ లో తెలుగు లో వెతికితే సంబంధించిన ఫలితాలలో సరిపోలిన వ్యాసం మీకు కనబడుతుంది. దీనిని చదివి  కంప్యూటర్ అంటే ఇంగ్లీషు బాగా రావాలని అపోహపడే వారెవ్వరైనా  వారి అపోహలను దూరంచేసుకొని తెలుగులో కంప్యూటర్ వాడటానికి ముందుకి వస్తారని ఆశిస్తాను.

ఇక కంప్యూటర్ లో తెలుగుని ఈ స్థాయికి తీసుకు రావటానికి దాదాపు పది సంవత్సరాలుగా కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు ఎంతోమంది వున్నారు. వారందరికి ధన్యవాదాలు. ఇటీవల ఉబుంటు తెలుగు అనువాదాలలో చాలా కృషి చేసిన ఉబుంటు తెలుగు స్థానికీకరణ జట్టు సభ్యుడు ప్రవీణ్  ఇల్లా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉబుంటు వాడి, మీ విమర్శలు, సలహాలు తెలియచేసి సమాచార సాంకేతిక ఫలాలు ప్రజలందరికి అందుబాటులోకి తెచ్చుటకు మీ వంతు సాయం చేయండి. ఉబుంటు 11.04  తెలుగులో వాడేవారు తెలుగు లినక్స్ వాడుకరుల మెయిలింగ్ లిస్ట్ లో సభ్యత్వం పొంది తమకి కలిగిన సందేహాలను మెయిల్ ద్వారా పంచుకుంటే తెలుగు స్థాయిని మరింత ముందుకు తీసుకువెళ్లటానికి  తోడ్పడినవారవుతారు. ఈ పుస్తకం పొందినవారు నాకు ఒక మెయిల్   పంపితే  మలిముద్రణల వివరాలు మీకు తెలియచేయటానికి వీలవుతుంది.

Thursday, February 10, 2011

గ్రామీణ ప్రజలకు ఐటి సాంకేతిక సేవలు - బైరెడ్డిపల్లె అవగాహన సదస్సు సమీక్ష

ప్రభుత్వ చట్టాలను, కార్యక్రమాలను, విధానాలను భారతీయ భాషలలో తెలియచేయటం కోసం, సిడాక్ నిర్వహణలో ఐఎన్డిజి.ఇన్ అన్న జాలస్థలి పనిచేస్తున్నది. దాదాపు 8 భాషలలో సమాచారం అందచేస్తూ, ఇంకా కొన్ని భాషల తోడ్పాటుకు కృషి జరుగుతున్నది. ఇటీవల నేను హైద్రాబాదు వెళ్లినపుడు, సీడాక్ సంస్థలో కదిరేశన్ వారి సిబ్బందిని కలిసి తెలుగు వికీపీడియా కృషి వివరించి, వారి సహాకారాన్ని అభ్యర్థించాను. సమాచారం భాగస్థులు అందచేస్తున్నందున మరల వినియోగానికి అనుకూలమైన నకలుహక్కులతో అందచేయటం వీలుకాదని వారు తెలిపారు. మొదట ప్రభుత్వ సమాచారాన్ని, ప్రభుత్వ సంస్థలు సరళమైన నకలు హక్కులుతో అందచేస్తే, మిగతా వారికి దారి చూపించినట్లవుతుందని తెలిపాను. తెవికీ అవగాహన సదస్సులు గురించి తెలిపి, వారి అవగాహన సదస్సులలో పాల్గొనటానికి అవకాశం ఇవ్వమనికోరాను. కతిరేశన్ గారు వెంటనే స్పందించి బైరెడ్డిపల్లిలో జరగబోయే సమావేశంలో పాల్గొనమని ఆహ్వానించారు.
From indg

బైరెడ్డిపల్లె చిత్తూరు జిల్లాలో మండల కేంద్రము. అక్కడి గ్రామీణ చిన్న పరిశ్రమల ఆభివృద్ధి సంఘం (రూరల్ స్మాల్ ఇండస్ట్రీస్ డవలప్మెంట్ సొసైటీ) ఆధ్వర్యంలో ఈ గ్రామీణ ప్రజలకు ఐటి సాంకేతిక సేవలు -అవగాహన సదస్సు 27 జనవరి 2011 న జరిగింది. నేను వుదయాన్నే బెంగుళూరు నుండి బస్సులో బయలుదేరి 10గంటలకల్లా పలమనేరు చేరాను. అక్కడికి వచ్చిన సిడాక్ ‌ వుద్యోగి శ్రీనివాసు, ఇతర స్వచ్ఛంధ సేవా సంస్థల మిత్రులతో బైరెడ్డిపల్లి చేరాము. అప్పటికే అంగన్ వాడి కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు మరియు ఇతర ఉద్యోగులు, వికలాంగులు, ఇతర స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చారు. దాదాపు 11 గంటలకి సభ ప్రారంభమైంది.

ప్రారంభ సమావేశం జరిగిన తరువాత, సిడాక్ ఉద్యోగి శ్రీనివాసరావు గారు ఐటి సేవల గురించి వుపన్యసించారు. చిన్న చిన్న ప్రశ్నలద్వారా సభికుల నుండే సమధానాలు రప్పిస్తూ, కంప్యూటర్, ఉపగ్రహం, నెట్వర్క్, ఐటి ఉపయోగాలు చాలా చక్కగా వివరించారు. గ్రామీణులకు వుపయోగపడే వివిధ రకాలైన సమాచారాన్ని, వారి మాతృభాషలో తెలుసుకోవడానికి దగ్గరిలోని సాధారణ సేవాకేంద్రాలు(కామన్ సర్వీస్ సెంటర్లు)ద్వారా తెలుసుకోమని చెప్పారు. ఐఎన్డిజి.ఇన్ వెబ్సైటులో సమాచారం ప్రత్యక్షంగా ప్రదర్శించారు.

నా ప్రసంగంలో తెలుగు వికీపీడియా గురించి వివరించి, ఎ‌వరైనా మార్చగల ప్రక్రియద్వారా అందరికి ఉపయోగపడే స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము వుపయోగాలు, ఐఎన్డిజి.ఇన్ వెబ్సైటుతో తేడాలు చెప్పాను. తెలుగు వికీపీడియాలో కొంత పనిచేస్తే ఆ తరువాత ఐఎన్డిజి.ఇన్ కు సమచారం అందించటం సులభమవుతుందని చెప్పాను. దీని గురించిన, తెలుగు టైపింగ్ తెలిపే కరపత్రాలు, వికీ దశాబ్ది వుత్సవాల స్టికర్లు, బటన్లు పంచిపెట్టాను. గ్రామస్తులలో కొంత మందికి సెల్ ఫోన్లలో తెలుగు వాడటం తెలిసినా వాడటం కష్టమనిపించేసరికి వాడటంలేదని తెలిసింది. ముందు ముందు స్పర్శ (టచ్) సెల్ ఫోన్లు తక్కువ ధరకి అందుబాటులోకి వచ్చి తెలుగు వాడటం సులువవుతుందని తెలిపాను. దాదాపు 2:30గంటలకు సమావేశం ముగిసింది. ఆ తరువాత సభికులందరికి భోజనం పెట్టారు.

ఇటువంటి అవగాహన సదస్సులు చాలా ఉపయోగం అయితే గ్రామీణులను ఆత్మవిశ్వాసంతో కంప్యూటర్ వాడటానికి ఇవి ప్రేరేపించడం లేదు. ఉదాహరణకి హెచ్ఐవి అనుమానం వున్న వ్యక్తికి/భాధితుడికి సమాచారం కావలసి వస్తే అతను ఆపరేటర్ దగ్గరికి వెళ్లి సమాచారం అడగటానికి మొహమాటపడతాడుకదా. అదే ఇటువంటి సదస్సులు కంప్యూటర్ ప్రయోగకేంద్రాలున్న కళాశాలలో నడిపి, పాల్గొన్న వారందరికి కంప్యూటర్ అంటే భయంపోగొట్టి, అనుభవం కల్గిస్తే వారంతట వారు కంప్యూటర్ని నెట్ సెంటర్లో వాడి మరింత ఆత్మ విశ్వాసంతో తమ తమ పనులను చక్కబెట్టుకోగలుగుతారు. అటువంటిది కల్పించకుండా గ్రామీణులను మీకు కావలసినవి ఏమిటని అడిగితే అది వృధాఅవుతుంది. ఈ దిశంగా సిడాక్ సంస్థ కార్యక్రమాల్లో మార్పులు చేస్తే బాగుంటుంది. వీరికి సహకరించడానికి నేను మరియు ఇతర వికీపీడియన్లు ఎప్పుడూ సిద్ధం. ఈ సమావేశంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన కతిరేశన్, శ్రీనివాస రావు, సహాయం అందించిన రవీంద్రనాథ్,సౌమిత్రి,గోవిందరాజ్ చౌదరి, వినాయకరెడ్డి మరియు ఉత్సాహంగా పాల్గొన్న సభికులకు నా ధన్యవాదాలు.