Pages

Sunday, June 27, 2010

ఐఒఎస్ 4 (ఐఫోన్ 4) తో తెలుగు

తెలుగుని స్మార్ట్ ఫోన్ లో చూసుకోవాలని అసక్తిగల వారందరికి శుభవార్త. ఐఫోన్ 4 తో యూనికోడ్ ఫాంటుల ను చూపించకల సౌకర్యం వుంది. అందుకని తెలుగు ఇతర భారతీయ భాషల అంతర్జాల స్థలాలు చూడవచ్చు. తెలుగు వికీపీడియా లాంటి సైట్లలో, లేక గూగుల్ సైట్లలో తెలుగు లిప్యంతరీకరణ పరికరము ద్వారా తెలుగు టైపు చేయవచ్చు.(మొబైల్ కోసం కాని దీనికి సాధారణ కంప్యూటర్ కి వాడే గూగుల్ అనువర్తనం వాడాలి) (అప్లికేషన్)  సఫారీ విహరిణిలో తెలుగు చాలా వరకు బాగానే చూపిస్తున్నది.

సెల్ ఫోను ఉత్పత్తి దారులు తెలుగు మాత్రమే తెలిసిన వారికోసం, చర్యల వరుసలు(మెనూలు), సంక్షిప్త వార్త (ఎస్ఎమ్ఎస్) వరకు తెలుగు సౌకర్యం కలిపించారు. ఐతే, వార్త అందుకునే వారు, అటువంటి తయారు దారు ఫోను కలిగి వుంటేనే, వాడుకోటానికి వీలు కలిగేది. వీటిని అధిగమించడానికి  ఈమధ్య జావా అనువర్తనాలు అందుబాటులోకి వచ్చాయి కాని అవి ఖర్చుతో కూడుకున్నవి.





ఆ తరువాత మన భాషల వార్తాపత్రికలు సెల్ ఫోన్ లో కనబడటానికి పదాలను బొమ్మలుగా మార్చి పంపే పద్ధతి (2005 ముందు పర్సనల్ కంప్యూటర్ లలో వాడినది) వాడారు. వీటికి అనువర్తనం (ఉచితం) స్థాపించుకోవాలి. వార్తలు ప్రత్యేకంగా (మామూలు వెబ్సైట్ కి భిన్నంగా) రాయాలి. ఇప్పుడు యూనికోడ్ సపోర్టుతో సెల్ ఫోన్ వచ్చేసరికి, మామూలు వెబ్సైటు చూడగలిగే అవకాశం వచ్చింది.

ఐతే, ఐఫోన్ ఖరీదు (రు 30,000/$ 600) దానికి అవసరమయ్యే డాటా ప్లాన్లు ఖర్చు ఎక్కువగా వుండటంతో, సామాన్య సెల్ ఫోన్ వాడుక దారుల కొరకు అందని పండే. ఆండ్రోయిడ్ లేక నోకియా వారి ఫోనులలో ఈ సౌకర్యం వచ్చేవరకు లేక ఆపిల్ ఫోన్లు ధర తగ్గే వరకు వేచి చూడాలి.

Sunday, May 16, 2010

ఇన్ స్క్రిప్ట్ ప్రయోగం ముగిసింది

"ఇండికీస్ ; ఇన్ స్క్రిప్ట్ తెలుగు అక్షర మీటకాల అతుకులు" ప్రయోగం ముగిసింది
ముగింపు బొమ్మలు చూడండి.
వాడిన తరువాత

అలవాటయిందని, అతుకులు తొలగించాక

మిగిలి పోయిన జిడ్డు తొలగించుతూ. (పూర్తిగా తొలగలేదు)

అనుభవం: టచ్ టైపింగ్ అలవాటవలేదు.ఉచ్ఛారణ సారూప్యమున్న ఇంగ్లీషు అక్షర మీటకి, తెలుగు అక్షరపు మీటకి గందరగోళం తగ్గటానికి చాలా అనుభవం కావాలి. ఇప్పటికి స్పీడు రాలేదు. 404 పదాలు, 2484 అక్షరాలు, టైపింగు వేగం 5932 బైట్లుకి ( utf-8) చేరుకుంది. (Gedit లో అరగంట టైపు చేసినగణాంకాల్ని రెట్టింపు చేశాను) ఇది పోతన తో వున్న వేగానికి (చాలాకాలం కిందటి) 18శాతం తక్కువ.

నిర్ణయం/సలహాలు
స్టికర్ల ఉపయోగం బాగానే వుంది. అయుతే నల్లగా మారకుండా వుంటానికి, వీటిపై పారదర్శక టేపు అంటించుకుంటే మంచిది. అయితే,
రానున్న స్మార్ట్ ఫోన్లను దృష్టిలో పెట్టుకుంటే, (వాటికి పూర్తి స్థాయి కీ బోర్డు వుండదు కాబట్టి), లిప్యంతరీకరణ కీ బోర్డులు,(పోతన లేక గూగుల్ లేక మైక్రోసాఫ్ట్ లాంటివి) వాడటం మంచిది. ఇన్ స్క్రిప్ట్ కూడా స్మార్ట్ ఫోన్లకు అనుగుణంగా చేయటం మంచిది. దీని గురించి త్వరలో ఇంకొక పోస్టు. ఇప్పటికి లిప్యంతరీకరణ కీ బోర్డులు వాడేవారు, ఇన్స్క్రిప్ట్ వైపు మారనక్కరలేదు.

Saturday, March 13, 2010

తెవికీ ప్రచారం 20-28 ఫిభ్రవరి 2010

తెవికీ ప్రచారంలో భాగంగా, రెండవ వికీ అకాడమీని క్యు.ఐ.ఎస్. సి .ఇ. టి (QISCET), ఒంగోలులో 20 ఫిభ్రవరి 2010న, మూడవ వికీ అకాడమీని ఎస్.ఎస్.ఎన్ కాలేజి (SSN College), నరసరావుపేటలో 22 ఫిభ్రవరి 2010న, తెలుగు వికీ ప్రదర్శన ని కె. ఎస్ .ఆర్. జడ్. పి. హెచ్ పాఠశాల (KSRZPH School), అన్నపర్రు లో 28 ఫిభ్రవరి 2010 , ఆయా యాజమాన్యాలు, అధికారుల సహాయంతో నిర్వహించాను.



 కె ఎస్ ఆర్ జడ్ పి హెచ్ పాఠశాల, అన్నపర్రు
దాదాపు 210 మంది అనుభవపూర్వకంగా తెలుసుకొనగా, 20 మంది పరిచయపూర్వకంగా తెలుసుకున్నారు. మెరుగు పరచిన కర పత్రిక పంచిపెట్టాను.

ఒంగోలులో, కంప్యూటర్ గదిలో, ప్రొజెక్టర్ లేకపోవటంతో, ఉపన్యాసాన్ని ఏక బిగిన పూర్తి చేసి ఆతరువాత అనుభవ కార్యక్రమం చేయటం జరిగింది. ఇక్కడ 120 మంది ౩ వ సంవత్సరపు బి. టెక్ (ఇసిఇ) విద్యార్ధులు పాల్గొన్నారు. నరసరావు పేటలో, 90 మంది ఎమ్ సి ఎ విద్యార్ధులు పాల్గొని చాలా ఆసక్తి చూపించారు. వీరందరిలో ఒక్కరికి మాత్రమే కంప్యూటర్లో, తెలుగు చూసిన అనుభవం వుంది. చాలా మందికి ఈ మెయిల్ విలాసమున్నా, వారానికి ఒక్కసారి కూడా వాడటంలేదు. కంప్యూటర్ని, ఈ మెయిల్ని వారానికి ఒకసారైనా వాడి, భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోమని సూచించాను.

కంప్యూటర్లో ఈ సారి, వికీపీడియా టైపింగు లిప్యంతరికరణ పద్ధతి వాడటం జరిగింది. అన్నపర్రులో గూగుల్ లిప్యంతరికరణ పద్ధతి గురించి అడిగారు. ఈ సారికి దాని గురించి మరింత తెలుసుకోని, ఈ కార్యక్రమంలో భాగంగా చేయటాన్ని పరిశీలించాలి.

విద్యార్ధుల నుండి స్పందన బాగానే వుంది. 3 గంటలు, ఈ కార్యక్రమానికి సరిపోవటం లేదు. సాధారణంగా, కళాశాల మూసే సమయం కాగానే, బస్సు పోతుందనో, రైలు పోతుందనో విద్యార్ధులు కాని, సాంకేతిక సిబ్బంది కాని వెళుతున్నారు. 25 సంవత్సరాల క్రిందటి లాగా హాస్టల్ లో వుండేవారు, ఎక్కువ కాలం అవసరమైతే, లాబ్ లో వుండే పరిస్థితి లేదు. ఒక రోజు ఐతే బాగుంటుంది. దీనిని ఒక మెళకువలు పెంచే కార్యక్రమంలా, సాంకేతిక కార్యక్రమాలకు ధీటుగా కళాశాలలకి తెలపాల్సిన అవసరం వుంది. దానికోసం వికీ పరిశోధన పరంగా, ఇంకొంత సమాచారం తయారు చేయాలి. వికీ అకాడమీ ముందు స్వేచ్ఛా మూలాల పై ఇచ్చే ఇంగ్లీషు ఉపన్యాసాన్ని, 1 గంట నుంచి పొడిగించి. ప్రాజెక్టు కార్యక్రమంగా మార్చాలి.

కళాశాల లేక పాఠశాలల యాజమాన్యాల తరపున సహాయం అందించిన డా: కె వీరాస్వామి, శ్రీ రాజ శేఖర్ కొతూరి, శ్రీమతి టి వెంకటసుబ్బమ్మ గార్లకి ధన్యవాదాలు.

Sunday, January 17, 2010

తెవికీ 2009 గణాంకాల విశ్లేషణ, 2010 లక్ష్యాల పై ఆలోచనలు


వికీపీడియా 9 వ జయంతి బెంగుళూరు సభ సందర్భంగా, నేను తెవికీ పై పత్రం (ఇంగ్లీషులో) సమర్పించాను. తెవికీలో తెవికీ 2009 గణాంకాల విశ్లేషణ చేశాను. ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే,
పేజి వీక్షణలు అత్యధిక స్థాయిలో డిసెంబరు 2009 లో 4.1 మిలియన్లు (అనగా 1.6 సెకండ్లకి ఒకటి) . ఇది డిసెంబరు 2008 తో పోల్చితే, 111 % పెరుగుదల. అన్ని వికిపీడియాల పెరుగుదల తోపోల్చితే తెవికీ 16 వ స్థానంలో వుంది. ఇది హైద్రాబాదు పుస్తక ప్రదర్శన లో ఇ-తెలుగు ప్రచారం ఫలితమేమో?
నాణ్యత పెరుగుతున్నప్పటికి, పెరుగుదల నేను అశించిన స్థాయిలో లేదు. 2010 కి మార్గదర్శకం చేయవలసిన బాధ్యత అనుభవజ్ఞులైన వికీపీడియన్లమీదవుంది.
నా సలహాలు

  • ప్రతి ఇంజనీరింగు/పెద్ద కాలేజీలో, తెవికీ అకాడమీ నిర్వహించడం.

  • ప్రధాన ప్రాజెక్టులు ఎంచుకొని, వాటికి మొదటి పుటనుండి లింకు ఇచ్చి, సహకారం పెంపొందించడం.

  • ప్రతి నెల/౩ నెలలకు ప్రగతి నివేదిక తయారు చేయడం

  • విద్యా శాఖ తో, చర్చించి మీడియా వికీ ప్రాజెక్టు ని పిల్లలకు పరిచయం చేసి, 8,9,10 స్కూలు పిల్లలు విద్యా శాఖ వారి,స్కూలు వికీలో ప్రాజెక్టులు చేయడం. మళయాళం వికీ వాళ్లు ఇలా చేస్తున్నారు

  • స్మార్ట్ ఫోనులలో తెలుగు వెబ్ సైట్ల ప్రదర్శనకు ఇబ్బందులను తోలగించటానికి కృషి చేయడం.


మరి మీరేమంటారు?

గమనిక:ఫోటో ఓంశివప్రకాష్ సౌజన్యంతో

Saturday, November 21, 2009

ఫైర్ఫాక్స్ తెలుగు వాడుకర్ల గణాంకాలు




ఫైర్ఫాక్స్ తెలుగు విడుదలై సంవత్సరం గడిచింది. 2009-11-17 వారానికి వాడుకర్ల గణాంకాలను పటంలో చూడండి.

మొత్తం వాడుకర్లు 2194 కాగా, దాదాపు 70 శాతం మంది భారత్ నుండి, అమెరికా నుండి 20 శాతం వున్నారు.
ఫైర్ఫాక్స్ లో బ్లాక్ లిస్ట్ అనే లక్షణం ద్వారా ఇవి సేకరించబడ్డాయి. దాదాపు 500 మంది వారానికి, ఫైర్ఫాక్స్ తెలుగు దించుకుంటున్నారు(downloads).
కంప్యూటర్ వాడే ప్రతి ఒక్కరు తప్పని సరిగా విహరిణి వాడతారు కాబట్టి, ఈ గణాంకాల్ని తెలుగులో కంప్యూటర్ వాడేవారి సంఖ్యకు సారూప్యంగా వాడుకోవచ్చు.

Sunday, October 11, 2009

మొదటి తెలుగు వికీ అకాడమీ (6 అక్టోబరు 2009, చీరాల) పై నివేదిక


మొదటి తెలుగు వికీ అకాడమీ, 6 అక్టోబరు 2009న చీరాల ఇంజినీరింగు కాలేజీ, చీరాలలో విజయవంతంగా జరిగింది. దీనిలో 120 మందికి పైగా మూడవ, చివరి సంవత్సరం విద్యార్ధులు పాల్గొన్నారు. 3 గంటలు పాటు తెవికీ పరిచయం, కంప్యూటరులో తెలుగు టైపు చేయు పద్ధతులను, తెలుగుకి కంప్యూటరును అనువుగా చేయడం, తెవికీ మూల స్థంభాలు, వ్యాసాలు మార్పు చేయడం, కొత్తవి రాయడం తెలుసుకొన్నారు. అందులోఒకటిన్నర గంటలసేపు కంప్యూటరుపై ప్రయత్నించి నేర్చుకున్నారు. ఈ సందర్భంగా, తెవికీ కరపత్రాన్ని పంచడం జరిగింది.

చాలా మంది, ఒకేసారి వికీపీడియా వాడటంతో, కొన్ని ఇబ్బందులు ఎదురయినవి. వాటిలో ముఖ్యమైనవి.
౧) ఆరు ఎకౌంట్లు కంటే ఎక్కువ మందిని వికీపీడియా లాగిన్ అవనివ్వలేదు. అందువలన, అనామకంగానే పని చేయమని చెప్పవలసివచ్చింది.
౨) తెలుగు భాషని అమర్చుకోవడానికి, సాఫ్టువేర్ స్థాపించన తరువాత మరల బూట్ చేయమంని అడుగుతుంది. కాని లాబ్ నియమాల ప్రకారం, మరల బూట్ చేసినపుడు, అ సాఫ్టువేర్ తొలగించి, సాధారణ స్థితిలో వుంచబడుతుంది. అందువలన, తెవికీ ఉచ్ఛారణ కీ బోర్డు మాత్రమే వాడమని చెప్పవలసి వచ్చింది.

వాటిని సరిచేసుకుంటే, ముందు ముందు మరింత నాణ్యతతో ఈ కార్యక్రమాలు నిర్వహించటానికి వీలవుతుంది.

ఈ కార్యక్రమాన్ని మొదట బెంగుళూరులో నిర్వహిద్దాని అనుకున్నా, నేను మా ఊరు దేవరపల్లి ఇటీవలి సెలవులకి వెళ్లడంతో, చీరాల ఇంజినీరింగు కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ కమాలుద్దీన్ తో మాట్లాడితే, ఆయన వెంటనే సరే అనడంతో, చీరాలలో నిర్వహించడం జరిగింది.
దీనికి ముందు విద్యార్ధులకి అసక్తి కలిగించడంకోసం, "స్వేచ్ఛా మూలాల ద్వారా విద్యార్ధుల నేర్పరితనం అభివృద్ధి చేయటం" (ఇంగ్లీషులో) Developing Student Skills through open source) " అనే దానిపై ఉపన్యాసం ఇచ్చాను. ఈ అవకాశం కల్పించిన చీరాల ఇంజినీరింగు కాలేజీ యాజమాన్యము, సిబ్బంది మరియు విద్యార్ధులకు కృతజ్ఞతలు.

Sunday, September 27, 2009

ఇండికీస్ ; ఇన్ స్క్రిప్ట్ తెలుగు అక్షర మీటకాల అతుకులు


చాలాకాలం క్రిందట ఇన్ స్క్రిప్ట్ తెలుగు వాడటానికి ప్రయత్నించి అన్ని అక్షరాలను సులభంగా గుర్తుపెట్టుకొనలేక పోతన కీ బోర్డు వాడటం మొదలెట్టాసు.
ఇన్ స్క్రిప్ట్ తెలుగులో ఒక్క క అక్షరము తప్ప ఏది ఇంగ్లీషు అక్షరా ఉచ్చారణకి దగ్గర లేదు. పోతనలో నాలుగైదు అక్షరాలు మినహా అన్నీ దగ్గరగా వుంటాయి.

ఇప్పుడు తెలుగు వికీపీడియా వ్యాప్తికి, అన్ని కంప్యూటర్లలో వాడగలది, భారత ప్రభుత్వంచే ప్రామాణికమైసదైనటువంటిది అయిన ఇన్ స్క్రిప్ట్ ని వాడటానికి ప్రయత్నించాను.
దానికోసం తెలుగు అక్షర మీటకాల అతుకులు తయారు చేశాను.
ఒక వైపు గమ్ము పూసిన పేపరు పై ముద్రించి ముక్కలుగా కత్తిరించితే మా అమ్మాయి చకాచకా వాటిని అంటించింది. ఇక తెలుగు కీ బోర్డు తయ్యార్.
అది వాడి ఈ బ్లాగాంశం రాశాను. పోతనకి అలవాటుబడిన చేతులు మొరాయిస్తుంటే ఇది రాయటానికి ౪౦ (40) నిముషాలు పట్టింది. అంటే 101 పదాలతో 777 అక్షరాలు రాయగా వేగం గంటకి ౦.౩కిలోబైట్లు.
తెలుగు అక్షర మీటకాల అతుకులు ఎవరైనా సులభంగా తయారు చేసుకోవచ్చు. త్వరలో మరంత మెరుగుపరిచి అందరికి అందచేయాలని ప్రయత్నిస్తున్నాను.