
సెల్ ఫోను ఉత్పత్తి దారులు తెలుగు మాత్రమే తెలిసిన వారికోసం, చర్యల వరుసలు(మెనూలు), సంక్షిప్త వార్త (ఎస్ఎమ్ఎస్) వరకు తెలుగు సౌకర్యం కలిపించారు. ఐతే, వార్త అందుకునే వారు, అటువంటి తయారు దారు ఫోను కలిగి వుంటేనే, వాడుకోటానికి వీలు కలిగేది. వీటిని అధిగమించడానికి ఈమధ్య జావా అనువర్తనాలు అందుబాటులోకి వచ్చాయి కాని అవి ఖర్చుతో కూడుకున్నవి.


ఆ తరువాత మన భాషల వార్తాపత్రికలు సెల్ ఫోన్ లో కనబడటానికి పదాలను బొమ్మలుగా మార్చి పంపే పద్ధతి (2005 ముందు పర్సనల్ కంప్యూటర్ లలో వాడినది) వాడారు. వీటికి అనువర్తనం (ఉచితం) స్థాపించుకోవాలి. వార్తలు ప్రత్యేకంగా (మామూలు వెబ్సైట్ కి భిన్నంగా) రాయాలి. ఇప్పుడు యూనికోడ్ సపోర్టుతో సెల్ ఫోన్ వచ్చేసరికి, మామూలు వెబ్సైటు చూడగలిగే అవకాశం వచ్చింది.
ఐతే, ఐఫోన్ ఖరీదు (రు 30,000/$ 600) దానికి అవసరమయ్యే డాటా ప్లాన్లు ఖర్చు ఎక్కువగా వుండటంతో, సామాన్య సెల్ ఫోన్ వాడుక దారుల కొరకు అందని పండే. ఆండ్రోయిడ్ లేక నోకియా వారి ఫోనులలో ఈ సౌకర్యం వచ్చేవరకు లేక ఆపిల్ ఫోన్లు ధర తగ్గే వరకు వేచి చూడాలి.