Pages

Tuesday, September 21, 2010

తెలుగు లినక్స్ స్థితి

నేను  దాదాపు రెండేళ్లనుండి లినక్స్ ని తెలుగు  స్థానికతతో వాడుతున్నాను.  అనువాదము మెరుగవుతూ వస్తున్నది. కాని  ఆశించినంతమేరకి లేదు. ఎందుకంటే ఏ ఒకరో ఇద్దరో మాత్రమే దీనికి తోడ్పడుతున్నారు.  నాకు తెలిసినంతవరకు క్లుప్తంగా తెలుగు లినక్స్ చరిత్ర చర్చించి, మరింత మెరుగుపరచడానికి చేయవలసినపనులను  వివరిస్తాను.
చరిత్ర
2002 లో కిరణ్ కుమార్ చావా తో గనోమ్  తెలుగు అనువాదం ప్రారంభమైంది.  అది జులై 2005 లో,
సునీల్ మోహన్ సారధ్యానికి మారింది.  సునీల్  వున్న స్వేచ్ఛ జట్టు కృషితో, తెలుగులో లినక్స్ 2005 లో విడుదల అయ్యింది.  చాలా వరకు గనోమ్ అనువాదం అయ్యింది. ఫైర్ఫాక్స్ 1.5 కూడా అనువదించబడింది.  అయితే  అది పై మూల నిల్వలలో(upstream repositories)  కలపబడలేదు. కృష్ణ, నేను ఫైర్పాక్స్ ని 2008  లో అనువాదంచేసి 2009లో విడుదల చేయటానికి సహకరించాము. మూల నిల్వలోకూడా చేర్చాము. ఇంకొక ముఖ్యమైనది ఒపెన్ ఆఫీసు. దీని అనువాదం  ఎవరో చేశారో తెలియదు. కాని అంత నాణ్యతగా అనిపించలేదు. గత సంవత్సరము కృష్ణ గనోమ్, ఫెడోరా అనువాదాన్ని మెరుగు పర్చటానికి కృషి చేశాడు.
ప్రస్తుత స్థితి
ప్రస్తుత(సెప్టెంబర్ 2010)  గనోమ్ తెలుగు గణాంకాలు చూద్దాము
గనోమ్ 2.30,  86%
గనోమ్ బయటి ఆధారాలు, 2%
గనోమ్ కార్యాలయ ఉత్పాదకత, 3%
గనోమ్ మూలసౌకర్యాలు, 0%
జింప్ మరియు స్నేహితులు, 0%
అదనపు గనోమ్ అనువర్తనాలు, 16%
పై వాటిని వాడుటకు పుస్తకాలు 0%
ఫ్రీ డెస్క్ టాప్ 23%

కెడిఇ ని పరిశీలిస్తే మొత్తంలో 50% అనువాదముకాగా దానిలోని విభాగాలు ఈ క్రింది విధంగా వున్నాయి.
desktop_kdelibs.po :75.53%
desktop_l10n.po : 1.05%
kdebase : 34.18%
kdelibs4.po : 78.60 %
దీనికి పవిత్రన్ మరియు కొంతమంది కలిసి ఒక ఒక జట్టుగా పనిపనిచేస్తున్నారు. అయినా తగినంత క్రియాశీలంగా లేదు..

ఇక పంపిణీ ల సంగతికి వస్తే, డెబియన్ ఇన్స్టాలర్ స్థిత ఈ విధంగా వుంది. 1 స్థాయి: 58% 2 స్థాయి: 93% మరియు 3 స్థాయి: 68%. ఉబుంటు లో 425038 లో 25% మాత్రమే  అనువాదంఅయినవి. ఫెడోరా లో తెలుగు వివరాలు వున్నాయి కాని క్లుప్తంగా స్థితి తెలియదు.
సమస్యలు మరియు తరువాత పని
2005 లో తెలుగు లినక్స్ విడుదలై 5 సంవత్సరాలు అయినా ఎంతమంది తెలుగు లినక్స్ ప్రధానంగా వాడుతున్నారు అన్నది పెద్ద ప్రశ్న. అనువాదానికి సంబంధించి  చైతన్యం లేదు కాబట్టి, ఎంతోమంది లేరు అనిచెప్పొచ్చు. మరి తెలుగు లినక్స్ బలపడటానికి, దీనిని పెద్ద ఎత్తున పాఠశాలల్లో, కార్యాలయాల్లో వాడకపోవటమే.  కొంతమంది విద్యార్థులు అనువాదానికి సహకరించినా, వారు తరువాత ఇంగ్లీషు వ్యవస్థలు వాడటమే. ఇంకొకటి తెలుగు అనువాదము లో సహకరించడానికి ఏక మాత్ర పీఠాలు లేక, వాటిని వాడక, ఎవరికి వారు తమ వరకే అన్నట్లుగా తీరికవేళల్లో అనువాదం చేయటం. అలా కాకుండా,ఉబుంటుకి అనుబంధంగా గల లాంచ్పాడ్ లాంటి అనువాద ప్లాట్ఫారమ్ వాడితే సగటు వాడుకరి కూడా అనువాదానికి సహకరించవచ్చు. ఈ ప్లాట్ఫారమ్ తెలుగు గణాంకాల ప్రకారం దాదాపు 68 మంది రకరకాలుగా అనువాదంలో పాలుపంచుకంటున్నా, ఒకే చోట సహకరించకపోవటంవలన, సమిష్టి గమ్యాలు లేకుండా పనిచేయటంవలన ప్రగతి అంతగా లేదు. నా  అనుభవం ప్రకారం లాంచ్పాడ్ మెరుగైనది గా అనిపించింది.  ఇప్పటికే ఒక మెయిలింగ్ లిస్టు తయారు చేశాను. దీనిలో అనువాదాలు చేస్తూ,  మిగతా వారితో  ఇండ్లినక్స్-తెలుగు (indlinux-telugu)    లిస్టు ద్వారా సమన్వయపరచుకుంటూ పోతే, త్వరగా తెలుగు లినక్స్ ని మెరుగు పర్చగలం.  అందరూ సహకరిస్తే, ప్రాధాన్యతని బట్టి అనువర్తనాలు ఎంపిక చేసి మన తెలుగు లినక్స్ ని మెరుగుచేయగలం,మరి మీరేమంటారు?