నేను దాదాపు రెండేళ్లనుండి లినక్స్ ని తెలుగు స్థానికతతో వాడుతున్నాను. అనువాదము మెరుగవుతూ వస్తున్నది. కాని ఆశించినంతమేరకి లేదు. ఎందుకంటే ఏ ఒకరో ఇద్దరో మాత్రమే దీనికి తోడ్పడుతున్నారు. నాకు తెలిసినంతవరకు క్లుప్తంగా తెలుగు లినక్స్ చరిత్ర చర్చించి, మరింత మెరుగుపరచడానికి చేయవలసినపనులను వివరిస్తాను.
చరిత్ర
2002 లో కిరణ్ కుమార్ చావా తో గనోమ్ తెలుగు అనువాదం ప్రారంభమైంది. అది జులై 2005 లో,
సునీల్ మోహన్ సారధ్యానికి మారింది. సునీల్ వున్న స్వేచ్ఛ జట్టు కృషితో, తెలుగులో లినక్స్ 2005 లో విడుదల అయ్యింది. చాలా వరకు గనోమ్ అనువాదం అయ్యింది. ఫైర్ఫాక్స్ 1.5 కూడా అనువదించబడింది. అయితే అది పై మూల నిల్వలలో(upstream repositories) కలపబడలేదు. కృష్ణ, నేను ఫైర్పాక్స్ ని 2008 లో అనువాదంచేసి 2009లో విడుదల చేయటానికి సహకరించాము. మూల నిల్వలోకూడా చేర్చాము. ఇంకొక ముఖ్యమైనది ఒపెన్ ఆఫీసు. దీని అనువాదం ఎవరో చేశారో తెలియదు. కాని అంత నాణ్యతగా అనిపించలేదు. గత సంవత్సరము కృష్ణ గనోమ్, ఫెడోరా అనువాదాన్ని మెరుగు పర్చటానికి కృషి చేశాడు.
ప్రస్తుత స్థితి
ప్రస్తుత(సెప్టెంబర్ 2010) గనోమ్ తెలుగు గణాంకాలు చూద్దాము
గనోమ్ 2.30, 86%
గనోమ్ బయటి ఆధారాలు, 2%
గనోమ్ కార్యాలయ ఉత్పాదకత, 3%
గనోమ్ మూలసౌకర్యాలు, 0%
జింప్ మరియు స్నేహితులు, 0%
అదనపు గనోమ్ అనువర్తనాలు, 16%
పై వాటిని వాడుటకు పుస్తకాలు 0%
ఫ్రీ డెస్క్ టాప్ 23%
కెడిఇ ని పరిశీలిస్తే మొత్తంలో 50% అనువాదముకాగా దానిలోని విభాగాలు ఈ క్రింది విధంగా వున్నాయి.
desktop_kdelibs.po :75.53%
desktop_l10n.po : 1.05%
kdebase : 34.18%
kdelibs4.po : 78.60 %
దీనికి పవిత్రన్ మరియు కొంతమంది కలిసి ఒక ఒక జట్టుగా పనిపనిచేస్తున్నారు. అయినా తగినంత క్రియాశీలంగా లేదు..
ఇక పంపిణీ ల సంగతికి వస్తే, డెబియన్ ఇన్స్టాలర్ స్థిత ఈ విధంగా వుంది. 1 స్థాయి: 58% 2 స్థాయి: 93% మరియు 3 స్థాయి: 68%. ఉబుంటు లో 425038 లో 25% మాత్రమే అనువాదంఅయినవి. ఫెడోరా లో తెలుగు వివరాలు వున్నాయి కాని క్లుప్తంగా స్థితి తెలియదు.
సమస్యలు మరియు తరువాత పని
2005 లో తెలుగు లినక్స్ విడుదలై 5 సంవత్సరాలు అయినా ఎంతమంది తెలుగు లినక్స్ ప్రధానంగా వాడుతున్నారు అన్నది పెద్ద ప్రశ్న. అనువాదానికి సంబంధించి చైతన్యం లేదు కాబట్టి, ఎంతోమంది లేరు అనిచెప్పొచ్చు. మరి తెలుగు లినక్స్ బలపడటానికి, దీనిని పెద్ద ఎత్తున పాఠశాలల్లో, కార్యాలయాల్లో వాడకపోవటమే. కొంతమంది విద్యార్థులు అనువాదానికి సహకరించినా, వారు తరువాత ఇంగ్లీషు వ్యవస్థలు వాడటమే. ఇంకొకటి తెలుగు అనువాదము లో సహకరించడానికి ఏక మాత్ర పీఠాలు లేక, వాటిని వాడక, ఎవరికి వారు తమ వరకే అన్నట్లుగా తీరికవేళల్లో అనువాదం చేయటం. అలా కాకుండా,ఉబుంటుకి అనుబంధంగా గల లాంచ్పాడ్ లాంటి అనువాద ప్లాట్ఫారమ్ వాడితే సగటు వాడుకరి కూడా అనువాదానికి సహకరించవచ్చు. ఈ ప్లాట్ఫారమ్ తెలుగు గణాంకాల ప్రకారం దాదాపు 68 మంది రకరకాలుగా అనువాదంలో పాలుపంచుకంటున్నా, ఒకే చోట సహకరించకపోవటంవలన, సమిష్టి గమ్యాలు లేకుండా పనిచేయటంవలన ప్రగతి అంతగా లేదు. నా అనుభవం ప్రకారం లాంచ్పాడ్ మెరుగైనది గా అనిపించింది. ఇప్పటికే ఒక మెయిలింగ్ లిస్టు తయారు చేశాను. దీనిలో అనువాదాలు చేస్తూ, మిగతా వారితో ఇండ్లినక్స్-తెలుగు (indlinux-telugu) లిస్టు ద్వారా సమన్వయపరచుకుంటూ పోతే, త్వరగా తెలుగు లినక్స్ ని మెరుగు పర్చగలం. అందరూ సహకరిస్తే, ప్రాధాన్యతని బట్టి అనువర్తనాలు ఎంపిక చేసి మన తెలుగు లినక్స్ ని మెరుగుచేయగలం,మరి మీరేమంటారు?
7 comments:
మిగతా భాష ల తో పోల్చి చూస్తే తెలుగు లైనక్స్ ఇంకా మెరుగు పడాల్సి ఉంది...తెలుగు అనువాదం/ లోకలైజేషను మెరుగు పడాల్సి ఉంది..నేను ఉబుంటు maverick వాడుతున్నాను..గూగుల్ లాగా ఎవరు అయినా తర్జుమా చేసి (Cloud sourcing) చేసి, ఎవరన్నా ఒకరు (తెలుగు పండితులు) నాణ్యతా పరీక్ష చేస్తే బాగుంటుంది...
ఇండ్లినక్స్ - తెలుగు లిస్ట్ పేజీకి లింకు ప్రధాన వ్యాసంలో ఇవ్వడ మరిచాను. అందుకనే ఈ వ్యాఖ్య.
సురేష్ గారు, తమ స్వంత ఉత్పత్తులకు గూగుల్, మైక్రోసాఫ్ట్ భాష అనువాదకులతో పనిచేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ భాష అనే ప్రాజెక్టు ద్వారా మీరు చెప్పిన విధంగా చెయ్యాలని ప్రయత్నించింది. అయితే అంత విజయవంతమవలేదు. స్వేచ్ఛా మూలాల తెలుగు గ్నూ/లినక్స్ వాటికి ప్రభుత్వ /భాషా సంస్ధల తోడ్పాటు వుంటేనే అది చేయగలుగుతాం. ప్రస్తుతానికి తెలుగు భాష సంస్థలు ఈ విషయమై క్రియాశీలంగా లేవు.
సురేష్ గారు చెప్పిన విదముగా తెలుగులో లైనక్స్ ఇంకా మెరుగు పడాల్సి వుంది ఇది చాలా నెమ్మదిగా ఉందనే చెప్పాలి దీనినే వేగవంతం చెయ్యాల్సిన బాధ్యత మనందరి మీద వున్నది.
అన్నిటిని అనువాదం చెయ్యటం కష్టమనే చెప్పాలి కానీ లైనక్స్ మొత్తాన్ని తెలుగులోకి అనువదించడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.ఉదాహరణకు గింప్ అనే సాఫ్ట్వేర్ ను తీసుకుంటే దీనిని అనువాదం చెయ్యటం చాలా కష్టం మరియు ఒకవేళ చేసినా దీన్ని ఉపయోగించేవారికి ఇంకా కష్టంగా అనిపిస్తుంది..అని నా ఉద్దేశ్యం.
అన్ని బాషలలోని కేవలం ఆంగ్లమును ఉపయోగించకుండా చేస్తున్నారా అనేది నా అనుమానం ఎందుకంటే ఆంగ్లములో ఉన్న ప్రతి పదానికి సరిగ్గా అదే అర్ధాన్ని ఇచ్చే ఇంకొక పదం కొన్ని సార్లు ఉండకపోవచ్చు.ఇలాంటి సందర్బాలలో ఆంగ్లం లో వున్నా పదాన్నే అదే ఉచ్చారణతో సొంత బాష లో ఉపయోగించవచ్చు కదా..?
ఇప్పుడు ఇంస్టాలేషన్ పద్ధతి కూడా కొన్ని బాషలలో ఉన్నది ఒకవేళ దేనిని కనుక స్వచ్చమైన తెలుగు అనువాదం చేస్తే ఎంతమంది అర్థం చేసుకోగలరు..?
కొన్నిటికి దీనిని చెయ్యకపోతేనే బాగుంటుంది అనేది కూడా గమనించాలి..
నేను ఈ మధ్యనే విండోస్ నుండి డెబియన్ కి మారాను అది చాలా బాగున్నా దానిని ఉపయోగించాలంటే కొంచెం ఎక్కువ పరిజ్ఞానం ఉండాలి అందుకనే ఉబుంటుకి 10.04 తెలుగుకి మారా.
అర్జున్ గారు మీ అంకితబావానికి కృతజ్ఞతలు.నేను కూడా మీ గుంపులో చేరుతాను.నేను కూడా ఈ తెలుగు లైనక్స్ ఉద్యమంలో పాలుపంచుకోగాలను.
ధన్యవాదాలు.
తెలుగు లినక్స్ గారు,
మీ తోడ్పాటుకి ధన్యవాదాలు. డిజిటల్ విప్లవము యొక్క పండ్లు సమాజంలో అన్ని వర్గాల వారికి అందాలంటే, తెలుగీకరణ స్థాయి పెరగాలి. మొత్తం పదాలన్నీ తెలుగికి మార్చి, ఎవరికి అర్థం కాకుండా చేయమనేది నా ఉద్దేశ్యము కాదు. సాధ్యమైనంతవరకి, తెలుగు పదాలను వాడుతూ ముందుకు పోవడమే, 5 వతరగతి తెలుగు బాలబాలికలు చక్కగా తెలుగులో వాడగలిగితే చాలు. దీనికి ఎంత సమయం పడుతుంది అన్నది చాలా బాధ్యతాదారులు (stakeholders) పై ఆధారపడుతుంది.
అర్జునరావు గారు,
మీరు చేస్తున్న కృషిని మేము ఎలా మర్చిపోగలం చెప్పండి,మీ ఉద్దేశ్యాన్ని తప్పుపట్టడం ఎంతవరకు సమంజసం..తెలుగులో ప్రావీణ్యం ఉన్నవారే కొరవడిన ఈ రోజులలో మీ లాంటి వారు ఈ విదంగా అంకిత భావంతో చెయ్యడమే చాల అరుదు.మీ ఉద్దేశ్యాన్ని నేను ఏ విదంగానూ తప్పుపట్టడం లేదు మీరు చెప్పినట్టుగానే "సాధ్యమైనంతవరకి, తెలుగు పదాలను వాడుతూ ముందుకు పోధాం" నేను నూరు శాతం మీతో ఏకీభవిస్తా.కానీ కొన్నిటిని మాత్రం అంటే ఉదాహరణకి గింప్ తీసుకోండి..(సాద్యమైనంత వరకు తెలుగీకరణ చేసి మిగిలిన పదాలను ఆంగ్ల పదాన్నే తెలుగు ఉచ్చారణతో ఉపయోగిస్తే మంచిదని నా అభిప్రాయం దీనితో మీరు ఏకీభవిస్తారా..?)నేను ఇలా ఎందుకు అంటున్నాను అంటే గింప్ సాఫ్ట్వేర్ లో ఉన్న పదాలను కనుక మనం తీసుకున్నట్టయితే వాటి మీద ఆధారపడే చాలా tutorials ఆంగ్లంలో ఉంటాయి వాటిని అనుసరిస్తూ చాలామంది వాటిని నేర్చుకుంటూ ఉంటారు.ఆ పదాలు ఎంతగా ప్రబావం చూపిస్తాయి అంటే మనం టైపింగ్ నేర్చుకోవాలంటే కీబోర్డ్ లేయౌట్ ను ఎలా గుర్తించు ఉంటామో అలాగా వారుకూడా ఆ పదాలను గుర్తిన్చుకోవాల్సిన పరిస్థితి.దీనిపై మీ స్పందనను తెలుపుతారని ఆశిస్తూ..
నా పేరు చెప్పటం మరిచా, ప్రవీణ్.
ధన్యవాదాలు.
ప్రవీణ్ గారు,
అనువాదం స్థాయి ఎంతవరకు జరగాలి అనేది తెలుగు వాడుక ఎంతవరకు వుండాలన్నదానిపై ఆధారపడుతుంది. తెలుగుని డిగ్రీ స్థాయి వరకు వాడాలనే ఉద్దేశ్యముతో అన్ని పాఠ్య విషయాలు వ్రాయబడ్డవి కదా. అలాగే గింప్ ప్రజాదరణ పొందిన అనువర్తనమైతే, దానిని పూర్తిగా అనువాదం చేయటం మంచిది. తరువాత శిక్షణ పత్రాలు కూడా అనువాదం చెయ్యవచ్చు. అంతగా వాడుకలేని అనువర్తనమైతే దానిని అనువాదం చెయ్యక వదిలివేయవచ్చు. మనం ప్రాధాన్యతలు కార్యాలయ అనువర్తనాలు దాటి పోవడానికి ఇంకా చాలా సమయం పట్టవచ్చు.
Post a Comment