Pages

Tuesday, November 23, 2010

తరచూ వాడే స్థానికీకరణ పదబంధాల సమీక్ష (FUEL-Telugu) సదస్సు 28-29, అక్టోబర్ 2010

ఇండ్ లినక్స్ మరియు తెలుగు మరియు ప్రాచ్య భాషల శాఖ,ఆచార్యా నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తరచూ వాడే స్థానికీకరణ పదాల  సమీక్ష (FUEL-Telugu) సదస్సు 28-29, అక్టోబర్ 2010 న నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించబడింది.భాషా వేత్తలు, భాషాభిమానులు, అభివృద్ధికారులు 578 పదాలను సమీక్షంచి , 68 శాతం పదాల మార్పులతో ప్రామాణిక పదాల నిర్ణయం చేశారు.  దీనిలో తెలుగు మరియు ప్రాచ్యభాషలశాఖ ఆచార్యులు, విద్యార్థులు  పాల్గొన్నారు. దీనిని ఉపయోగించి స్థానికీకరణ మెరుగుపరచితే, తెలుగు లినక్స్ అనువర్తనాలలో పదజాలం ఏకరూపత సాధించబడి, వాడుకరులకు తెలుగు లినక్స్ వాడటం సులభమవుతుంది. అలాగే ఇతర తెలుగు భాషా సాఫ్ట్వేర్ తయారు దారులు ముందు ముందు చేయికలిపితే తెలుగు భాషాభివృద్ధికి, భాష పరిరక్షణకు దోహద పడుతుందనటంలో సందేహం లేదు.





తరచూ వాడే స్థానికీకరణ పదాల(FUEL) పదాల విశ్లేషణ
రాజేష్ రంజన్ ప్రారంభించిన ఈ ఫ్యూయల్  పథకం ద్వారా  కంప్యూటర్ భాష అనువాదాలలో ఏకరూపత సాధించడం ఉద్దేశం. ఇప్పటికే చాలా భారత దేశ భాషలకొరకు సదస్సులు నిర్వహించబడినవి.  ఈ పదాలని అనువర్తనాల వారీగా విశ్లేషణ పటంలో చూపబడింది. దీనిని మనము పరిశీలిస్తే ఒకటికన్నా ఎక్కువ అనువర్తనాలలో వాడిన పదాలు 10 శాతం మాత్రమే అని తెలుస్తుంది. అంటే ఈ జాబితాని ఏకరూప పదాలనే కాకుండా,  తరచూ వాడే అనువర్తనాలలో అనగా కార్యాలయ సాఫ్ట్వేర్, మెయిల్ కక్షిదారు (client) మరియు మెనూ (ప్రారంభతెరలో అనువర్తనాల సూచికలు) లోని ముఖ్యమైన పదాలుగా అన్న అర్థంలో మనం తీసుకోవాలి. ఈ అనువర్తనాలు స్వేచ్ఛ గ్రూపు, ఇతర వ్యక్తులు (సాధారణంగా ఇంజనీరింగ్ విద్యార్థులు, అభివృద్ధికారులు) అనువాదం చేశారు. ఐతే ఈ జాబితాని ఇంతవరకు సమీక్షించలేదు. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం భాషా వేత్తలతో సమీక్షించి ప్రామాణిక పదాలను తయారు చేయడమే.




సదస్సు వివరాలు
సదస్సు జరపటానికి కొంత కాలంగా ప్రయత్నాలు జరిగినా, చివరకు పవిత్రన్ నాగార్జున విశ్వ విద్యాలయ తెలుగు శాఖ వారితో కలిసి చర్చించటం, వారు అంగీకారం తెలపటంతో ఫలితం చిక్కింది. నేను, కృష్ణ ఫైర్ఫాక్స్ అనువాదాలలో కలసి పనిచేసాం, తెలుగు స్థానికీకరణకు కృషి చేస్తున్నాం. కృష్ణ రెడ్హాట్ లో పనిచేస్తుండడంతో, ఈ సదస్సుకి రెడ్హాట్ ప్రాయోజకత్వం వుండడంతో తరువాత పనులు సులభం అయ్యాయి. ఫ్యూయల్ స్థాపకుడు రాజేష్ రంజన్ తో చర్చించి ఈ సదస్సుకి కార్యసూచిక తయారు చేసి ఆయన సలహాలు తీసుకున్నాము.

నేను బెంగుళూరు నుండి, పూనా నుండి కృష్ణ బాబు కొత్తపల్లి , రెడ్ హేట్లో తెలుగు అనువాదాలకొరకు పనిచేసే ఉద్యోగి , ఖ మ్మం నుండి పవిత్రన్ శాఖమూరి  ,ఫాస్ (FOSS) సలహాదారువచ్చి విజయవాడ లో శ్రీపాద హోటల్ లో బసచేశాము. ఈ సమావేశం గురించి, మెయిలింగు లిస్టులలో చేసిన ప్రచారానికి, విజయవాడలో వుంటున్న పద్మక‌ళ, పాత్రికేయరంగం అనుభవం గల  తెలుగు భాషాభిమాని స్పందించి కార్యక్రమానికి తోడ్పడ్డారు.

 మొదటి రోజు ఉదయం ప్రారంభ సభ జరిగింది. దానిలో డా మన్నవ సత్యన్నారాయణ, తెలుగు మరియు ప్రాచ్య భాషల శాఖాధిపతి తో పాటు భాషావేత్తలైన తెలుగు మరియు సంస్కృత ఆచార్యులు  డా కె సత్యన్నారాయణ, డా ఎన్ వి క్రిష్ణారావు, డా మాధవి, డా ఇ ప్రభావతి మరియు  డా పి వరప్రసాదమూర్తి   పాల్గొన్నారు. డా మన్నవ సత్యన్నారాయణ గారు మాట్లాడుతూ, దాదాపు పదిహేను కోట్లమంది మాట్లాడే తెలుగు భాష ఔన్నత్యాన్ని వివరించారు. అన్యభాషా పదాలు తనలో ఇముడ్చుకోగల శక్తి అజంత గుణంగల తెలుగుకి వుందని, అందుకనే గానయోగ్యత వుంది కాబట్టి, భాషాభిమానులైన తమిళులు కూడా మన కీర్తనలను మనభాషలోనే వాడుకుంటున్నారని తెలిపారు.  విజ్ఞానాభివృద్ధితో పాటు తెలుగుని ఆధునికం చేయవలసిన అవసరాన్ని వివరించారు. అయితే పూర్తి తెలుగు పదాలను రూపొందించింతే సాధారణ వ్యక్తికి అర్థం కాదు కాబట్టి, ఇప్పటికే తెలుగు భాషలో ఇమిడిపోయిన పరభాషా పదాలను కంప్యూటర్ లో వాడుకుంటూ , వాడుకలోలేనిపదాలకు తెలుగు పదాలను నిర్ణయించి ప్రాచుర్యం కలిపించాలని కోరారు. కంప్యూటరు అక్షరాస్యత (విద్య) అందరు తెలుసుకోవాలని, లేకపోతే ఆధునిక యుగంలో నిరక్ష్యరాస్యులుగా పరిగణించబడతారని ఇతర వక్తలు తెలిపారు.

ఆతిథులు పరిచయాలు జరిగిన తరువాత, కంప్యూటర్లో తెలుగు గురించి , తెలుగు ప్రవేశపెట్టు పద్ధతులు, తెలుగు వికీపీడియా (స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం) మొదలైన వాటిని గురించి సమర్పణం (presentation) మరియ ప్రత్యక్షంగా తెలుగు ముఖాంతరముగల నిర్వహణ వ్యవస్థ, జాలగూళ్ల(వెబ్సైటుల) వీక్షణ ద్వారా వివరించడం జరిగింది. ఫెడోరా , డెబియన్ లినక్స్ సిడిలు పంచి పెట్టారు. ఈ విధంగా కంప్యూటర్ తెలుగు స్థాయి, సమస్యల గురించి న నేపథ్యాన్ని సదస్సు సభ్యులకు అవగాహన కలిగించాము.

ఆ తరువాత సమీక్ష లో కృష్ణ పదం చర్చకు మొదలుపెట్టడం, నేను, పవిత్రన్ దాని సందర్భాన్ని వివరించడం ఆ తరువాత ఇప్పుడు వున్న అనువాదం కంటే మెరుగైన పదాలు చర్చించి, ప్రామాణిక పదాల నిర్ణయం చేయడం జరిగింది. దీనికి పాటించిన కొన్ని మార్గదర్శక సూత్రాలు
  • క్లుప్తమైన పదము మెరుగైనది. ఉదా పంపుము బదులుగా పంపు,
  • వాడుకలోకి వచ్చిన ఇంగ్లీషు పదాలను అనువాదం చెయ్యకుండా ఆలాగే లిప్యంతరీకరణతో తెచ్చుకోవడం. ఉదా: ఫైల్, గ్రిడ్, షీట్ మొదలైనవి
  • వ్యావహారిక పదాలను(సులభంగా అర్థమయ్యేవి) వాడటం. సాధ్యమైతే సున్నతో అంతం చేయడం
  • ఇంగ్లీషు ఎబ్రీవియేషన్స్ ని తెలుగు లిపిలో రాసి, బ్రాకెట్లలో ఇంగ్లీషు అక్షరాలు రాయడి ఉదా:CD, DVD 
కొన్ని పదాల చర్చ చాలా ఆసక్తికరంగా సాగింది.Search అన్న పదానికి, వెతుకు, శోధన, అన్వేషణ, అన్న వాడుకలున్నాయి. శోధన కు బాధించు అనే అర్థము కూడా వుండడంతో దానిని పరిగణించలేదు. వెతుకు , అన్వేషణ లో అన్వేషణ  బాగుందని ప్రామాణికం చేయబడింది. అలాగే Wizard ను సూచించే  పదాలకు (Goal seek, data pilot)  మంత్రదండం అనకుండా సౌలభ్యం  అని నిర్ణయించడం జరిగింది.  Archive కు వున్న సంగ్రహ అన్న పదాన్ని పరిశీలించి, సంకోచ వ్యాకోచ నిర్వాహకి  అన్న పదం చర్చించి, అది ఇంకా పూర్తి అర్థం  ఇవ్వదు కాబట్టి ఆర్కైవ్ గా నే వుంచడం జరిగింది.  greyscale అన్న పదానికి  తెలుపునలుపులస్థాయి  అని నిర్ణయించాము. ఇంకొన్ని  పదాల  అనువాదాలు గమనించండి. Profile కి వున్న అర్ధముఖాలు బదులుగా పరిచయ పత్రం, Alignment కి వున్న లీనము నకు బదులుగా హద్దుకనుగుణం, Support కి వున్న మద్దతుకి బదులుగా తోడ్పాటు, Inbox కివున్నఇన్ బాక్సు బదులుగా వచ్చిన వుత్తరాలు, Input Method కి పున్న ఎగుబడి పద్దతి బదులుగా, ప్రవేశ పద్దతి.


పని చురుకుగా జరగటానికి పదబంధాలను ప్రాధాన్యతలుగా వేరు చేసి ముఖ్యమైనవాటిని చర్చించడం జరిగింది. సదస్సు తరువాత అన్ని పదాలని మరల పరిశీలించి వచ్చిన సందేహాలకు మరల భాషా వేత్తలతో క్లుప్తంగా ఫోన్ ద్వారా చర్చించడం జరిగింది. బహుళ అనువర్తనాలలో వచ్చే మార్పుచెందిన పదాల వివరాలు స్ప్రెడ్ షీట్ చూడండి.పదబంధాల మార్పులు అనువర్తనాల వారీగా ఛార్ట్ చూడండి.

ఉపయోగపడిన ముఖ్యవనరులు

ముగింపు 
ముగింపు సమావేశంలో మాట్లాడుతూ, డా మంతెన సత్యన్నారాయణ గారు తమ శాఖ భాషాపరిశోధనను వివరించారు. 1976లో ప్రారంభమైన ఈ శాఖకు   శ్రీయుతులు తూమాటి దోణప్ప, బొట్టుపల్లి పురుషోత్తం, యార్లగడ్డ గంగాధరరావు చేసిన కృషిని వివరించారు. ఈ శాఖతోవిద్యార్థి దశనుండి, 2009 లో శాఖాధిపతి పదవి చేపట్టటం వరకు తనకున్న అనుబంధాన్ని వివరించారు. శాఖ ఆచార్యుల, విద్యార్థుల పరిశోధనలు   ఉదా: "అడవి బాపిరాజు నవల సాహిత్యానుశీలనం", "తెలుగు సాహిత్యంలో నిషిద్ద నాటకాలు", "తెలుగు వారి ఇంటిపేర్లు",మరియు  "సుభాషిత నిధి- తులనాత్మక అధ్యయనం",  చాలా పుస్తక రూపంలో ప్రకటితమయినవనని చెప్పారు. విద్యార్థులకు ఉపన్యాసాలే కాకుండా ప్రతి వారం సాంస్కృతిక కార్యక్రమాలు, పేరుపొందిన భాషా వేత్తలపరిచయవేదికలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంతో కంప్యూటర్ తెలుగు కోసం  తోడ్పడటం చాలా ఆనందంగా వుందని అన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోను రూపంలో తెలుగులో అంతర్జాలం సాక్షాత్కరించే రోజు త్వరలో రానున్నదని, దానికి నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు శాఖతో పాటు, ఇతర తెలుగు అధ్యయన కేంద్రాలతో , సాఫ్ట్వేర్ సంస్థలతో కలసి పనిచేయవలసిన అవసరంగురించి అర్జునరావు వివరించారు. ఈ పనికి ముందు ముందు మరింత తోడ్పాటు అందిస్తామని సత్యన్నారాయణ గారు హామీ ఇచ్చారు. సదస్సు కి మద్దతిచ్చిన రెడ్హాట్ సంస్థ కి  సదస్సు సభ్యుల తరపున ధన్యవాదాలు తెలిపారు.

2 comments:

Arjun said...

తెలుగు పదం లో చర్చ చూడండి

Arjun said...

లిబ్రెఆఫీస్ లో మార్పులు చేయటంలో అనుభవాలు: లిబ్రెఆఫీసు-తెలుగు మెయిల్ లింకుఇది ఇతర గ్రూపులు తెలుగపదం మరియు ఇండ్లినక్స్-తెలుగు మరికొన్న చోట్లకూడా పంచబడింది.