Pages

Thursday, December 30, 2010

తెలుగుబ్లాగు సభ్యుల మరియు క్రియాశీలత గణాంకాల విశ్లేషణ

గత నాలుగేళ్లుగా తెలుగు గణన ప్రక్రియని దగ్గర నుండి గమనిస్తున్న నాకు మన పురోగతిని తెలిపే గణాంక విషయాల సూచీ లేకపోవటం భాధనిపించింది. ఇటీవల నేను AGIS'10 అనే స్థానికీకరణకు సంబంధించిన సమావేశంలో పాల్గొన్నప్పడు, ఇటువంటి సూచన ఒకరు చేశారు. మన దేశ భాషలలో గణన ప్రక్రియ స్థితి ఎలా వుందో తెలపటానికి వాణిజ్య సర్వేక్షణ సంస్థలు చేసే సర్వేలు తప్ప మిగతావేవిలేవు. తెవికీ లో గణాంకాలు లభ్యమవుతున్నాయి. ఫైర్ఫాక్స్ తెలుగు వాడుకరులపై కూడా గత సంవత్సరం నుండి గణాంకాలు లభ్యమవుతున్నాయి. వీటినంటిని మిళితం చేసి ఒక సూచి తయారుచేస్తే మన సముదాయంలో జరుగుతున్న మార్పులు చర్చించుకోవటానికి వీలవుతుంది.

మొదటగా కంప్యూటర్లో తెలుగు వాడే వ్యక్తులు ఎక్కువగా పాల్గొనేది తెలుగుబ్లాగు గూగుల్ గ్రూప్ సభ్యత్వములో మార్పులు, ఉత్తరాలలో మార్పులు ఒక ప్రధాన సూచిగా పనికి వస్తాయని అనిపించింది. వీవెన్ సహకారంతో గణాంకాల దత్తాంశం సంపాదించి,వాటిని కొంత విశ్లేషించి పటాల రూపంలో మీ ముందుంచుతున్నాను.

ముందుగా సభ్యుల సంఖ్య, ఉత్తరాల సంఖ్యను చూడండి. 2005 ఏప్రిల్ లో ఏర్పడిన ఈ గుంపు ప్రతిసంవత్సరం సభ్యుల సంఖ్యలో పెరుగుతూ వచ్చి ప్రస్తుతం 2144 సభ్యులకు చేరింది. అయితే ఉత్తరాల సంఖ్య విషయములో 2007 లో 7519కి చేరి ఆ తరువాత అథోముఖంగా పయనించి 2010 లో 1423 హద్దులకు చేరింది.


పెరుగుదల శాతాలు ఈ క్రింది పటములో గత నాలుగు సంవత్సరాలకు చూడవచ్చు.

కంప్యూటర్ల అమ్మకాల పెరుగుదల (భారతదేశం మొత్తానికి)గత ఆర్థిక సంవత్సరకాలంలో 18% వుంటే సభ్యుల పెరుగుదల -45 శాతం ఉత్తరాల పెరుగుదల -44 శాతం వుండటం భాధాకరం. రోజువారి వాడుకలో తెలుగుకు ప్రాధాన్యత తగ్గుతున్న ఈ రోజులలో కంప్యూటర్ రంగంలో కూడా ఇదే ప్రభావం కనబడుతున్నదనుకుంటున్నాను. దీనిని ఇంకా అర్ధం చేసుకోవటానికి వ్యాఖ్యల ద్వారా లేక మీ బ్లాగులలో వ్యాసాలు ద్వారా సహాకరించమని కోరుతున్నాను.

4 comments:

Shiva Bandaru said...

గతంలో యీనికోడ్ తెలుగు ఇబ్బందులవల్ల ఎక్కువగ గూగిల్ బ్లాగు గుంపులో సందడి ఉండేది. ఇప్పుడు యూనికోడ్ తెలుగు సరళంగా ఉండటం , బ్లాగర్ లోనే తెలుగు టైప్ చేసుకునే సదుపాయాలుండటంతో బ్లాగర్ గుంపు అవసరం బాగ తగ్గిపోయింది అంతే తప్ప అది తెలుగు వాడకానికి ప్రామాణికం కాదు.ఇక యూనికోడ్ వల్ల ఇంటర్‌నెట్లో ఎన్నడూ లేనంతగా తెలుగు వాడకం పెరుగుతుంది.ముందు ముందు ఇంకా పెరుగుతుంది

Arjun said...

శివబండారు గారు, మీ స్పందనకు ధన్యవాదాలు.మీ అభిప్రాయం సమర్థించటానికి, కూడలి,హారం నిర్వాహకులు, వారు పోగుచేస్తున్న బ్లాగు పోస్టుల గణాంకాలు విశ్లేషిస్తే తెలుస్తుంది. నా అనుభవం ప్రకారం తెవికీలో క్రియాశీలతకూడా బాగాతగ్గిపోయింది.అందుకని యూనికోడ్ తోడ్పాటు తెలుగు వారి క్రియాశీలతని పెంచిందని యిదమిద్దంగా చెప్పలేకపోతున్నాను.

Anonymous said...

తెలుగు బ్లాగు గుంపులో తగ్గుదలకి ఒక కారణం జాలంలో ఇతరత్రా తెలుగు పెరుగుదల కూడా. అదే ప్రధాన కారణం కాకపోవచ్చు.

జాలంలో తెలుగుకి ఇప్పుడు తెలుగు బ్లాగు గుంపు ఒక్కటే వేదిక కాదు కదా! జాలంలో తెలుగు గుంపులు పెరిగాయి. ఇంతకు మునుపు అందరూ కొద్ది గుంపుల్లోనే క్రియాశీలంగా ఉండేవారు. ఇంకా, జనాలు గూగుల్ బజ్ మరియు ఫేస్‌బుక్ వంటి సైట్లలో కూడా తెలుగుని ఉపయోగిస్తూ ఉన్నారు.

Arjun said...

వీవెన్, మీ అభిప్రాయంతో కొంత ఏకీభవించినా, ఏ ఇతర గ్రూపులు తెలుగుబ్లాగు స్థాయిలో చేతనంగా వున్నట్టు కనిపించదు.తెలుగు వాడుతున్న గ్రూపులను పేరేటోగా విశ్లేషించి 80 శాతం వంతు సంభాషణలకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రూపులకు కలిసి విశ్లేషణ చేస్తే సరైన ఫలితం రావచ్చు. దీనితో పాటు మీ కూడలి గణాంకాలు చాలా వుపయోగంగా వుంటాయి.ఆ పనికి నా వంతు సహాయం అందించగలను.