Pages

Saturday, April 30, 2011

ఉబుంటు వాడుకరి మార్గదర్శని: తెలుగులో ప్రారంభం నుండి ముగింపు దాక

 ఉబుంటు వాడుకరి మార్గదర్శని నుండి
ఉబుంటు 11.04 28 ఏప్రిల్ 2011 న విడుదలైంది. ఉబుంటు ఒక స్వేచ్ఛాబహిరంగ మూలాల లినక్స్ పంపకం. విండోస్ లాంటిది కొనుక్కొనవలసి వుండగా ఇది ఉచితంగా లభ్యమవుతుంది. దీనిలో మీకు కావలసినఅనువర్తనాలన్నీ (చలనచిత్ర ప్లేయర్, సత్వర సందేశిని, కార్యాలయ సాఫ్ట్వేర్, ఆటలు) అన్నీ ఉచితం. మూలాలు అందుబాటులో వున్నందున, దీనిలో మార్పులు చేయటానికి ఎవరైనా సహకరించవచ్చు. కార్యాలయాలలో వాడాలంటే కెనానికల్ సంస్థ మరియు ఇతర సంస్థల తోడ్పాటు కొనుక్కోవచ్చు. ఉచితంగా వాడాలన్నా మీ తోటి వాడుకరుల మెయిలింగ్ లిస్టులు, వెబ్సైట్లు ద్వారా సహాయపడుతుంటారు.ఈ విడుదలలో ఒక కొత్తరకం అంతర్వర్తి పరిచయం అవుతుండగా, తెలుగు తోడ్పాటు ప్రారంభం నుండి (డివిడి ప్రవేశపెట్టి బూట్ చేయడం నుండి) ముగింపు వరకు వుండటం ప్రథమం.   బహుశా డిబియన్ మరియు డెబియన్ ఆధారిత పంపకాలను తప్పించి మిగతా లినక్స్ పంపకాలలో లేదనుకుంటాను. ఇక ఇప్పుడు ఇంగ్లీషు అంతగా రాని పిల్లలు, పెద్దలు, అందరూ దర్జాగా కంప్యూటర్ వాడవచ్చు. తెలుగుతో పాటు కన్నడం కూడా తోడ్పాటు లభించటంతో  ఇప్పుడు భారతదేశ భాషలలో పది భాషలలో అందుబాటులోకి వచ్చింది.

ఉబుంటు విడుదలలో బహుళ స్పర్శ సాంకేతిక సౌలభ్యం వుంది. అంటే మౌస్ తో వాడుకోవటం పాతబడే రోజులు దగ్గరయ్యాయి. చేతి వేళ్లతో రకరకాల పనులు చేయవచ్చు. దీనికి కావలసిన ట్రాక్ పాడ్ కొత్తగా వచ్చే  లాప్టాప్, నెట్బుక్, టాబ్లెట్ లలో లభ్యమవుతుంది. బ్లూటూత్ సౌకర్యం వున్న లాప్టాప్ వాడుకరులు యాపిల్ ట్రాక్ పాడ్ కొనుక్కొని ఈ కొత్త సౌలభ్యాన్ని  ఉపయోగించుకోవచ్చు.

దాదాపు పది ఏళ్ల నుండి తెలుగు స్థానికీకరణం గురించి జరుగుతున్న కృషికి ఇదొక మైలు రాయు. 2005 లో తెలుగు తోడ్పాటు మొదలైనా, ఫైర్ఫాక్స్, నాణ్యత గల తెలుగు కార్యాలయ సాఫ్ట్వేర్ (లిబ్రెఆఫీస్) లభ్యం కావటానికి ఇంత సమయం పట్టింది. మీరు ఇప్పటికే విండోస్ వాడుతున్నా, దీనిని రెండవ నిర్వహణ వ్యవస్థగా లేక దానిపై అనువర్తనంలాగా వాడటానికి అవకాశముంది.

ఎలెక్ట్రానిక్ పుస్తకం
దీనిని గురించి తెలుగులో తెలుగు తెరపట్టులతో (screenshots) తో సులభంగా అర్థమయ్యే రీతిలో  ఎలెక్ట్రానిక్ పుస్తకం తయారు చేసి అందుబాటులోకి తేవడమైనది.  దీని ప్రత్యేకత ఏమిటంటే దీనిని తయారు చేయటానికి పూర్తిగా స్వేచ్ఛాబహిరంగ మూలాల సాఫ్ట్వేర్( ఉబుంటులోనిదే)  వాడబడింది. ఆలాగే దీని మూలాలు వికీబుక్స్ లో రాయబడ్డాయి.  ఇవన్నీ స్వేచ్ఛానకలుహక్కులు పరిమితులు CC-BY-SA-3.0 క్రింద లభ్యమవుతాయి. అందుకని మీరు దీనిని ఉచితంగా పొందవచ్చు, ఇతరులతో పంచుకోవచ్చు.  దీనిని మీరు ఎలెక్ట్రానిక్ రూపంలో చదువుకోవచ్చు లేకపోతే అడోబ్ రీడర్ తో బుక్ లెట్ రూపంలో  మీ ప్రింటర్ పై ముద్రించుకొని మధ్యలో పిన్ను చేసుకుంటే భౌతిక పుస్తకం లాగా చదువుకోవచ్చు. ఇక దీని మూలాలు వికీబుక్స్ లో వున్నాయి కాబట్టి మీరు ఇంటర్నెట్ లో తెలుగు లో వెతికితే సంబంధించిన ఫలితాలలో సరిపోలిన వ్యాసం మీకు కనబడుతుంది. దీనిని చదివి  కంప్యూటర్ అంటే ఇంగ్లీషు బాగా రావాలని అపోహపడే వారెవ్వరైనా  వారి అపోహలను దూరంచేసుకొని తెలుగులో కంప్యూటర్ వాడటానికి ముందుకి వస్తారని ఆశిస్తాను.

ఇక కంప్యూటర్ లో తెలుగుని ఈ స్థాయికి తీసుకు రావటానికి దాదాపు పది సంవత్సరాలుగా కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు ఎంతోమంది వున్నారు. వారందరికి ధన్యవాదాలు. ఇటీవల ఉబుంటు తెలుగు అనువాదాలలో చాలా కృషి చేసిన ఉబుంటు తెలుగు స్థానికీకరణ జట్టు సభ్యుడు ప్రవీణ్  ఇల్లా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉబుంటు వాడి, మీ విమర్శలు, సలహాలు తెలియచేసి సమాచార సాంకేతిక ఫలాలు ప్రజలందరికి అందుబాటులోకి తెచ్చుటకు మీ వంతు సాయం చేయండి. ఉబుంటు 11.04  తెలుగులో వాడేవారు తెలుగు లినక్స్ వాడుకరుల మెయిలింగ్ లిస్ట్ లో సభ్యత్వం పొంది తమకి కలిగిన సందేహాలను మెయిల్ ద్వారా పంచుకుంటే తెలుగు స్థాయిని మరింత ముందుకు తీసుకువెళ్లటానికి  తోడ్పడినవారవుతారు. ఈ పుస్తకం పొందినవారు నాకు ఒక మెయిల్   పంపితే  మలిముద్రణల వివరాలు మీకు తెలియచేయటానికి వీలవుతుంది.

3 comments:

లినక్స్ ప్రవీణ్ said...

ఒక నిర్వాహణ వ్యవస్థ పై ఇటువంటి మార్గదర్శిని తెలుగులో ఇప్పటివరకూ లేదనుకుంటాను. దీనిని మొదటగా తయారుచేసిన ఘనత మీకే చెందుతుందేమో. కొన్ని కారణాల వలన దీనికి తోట్పాటు అందించలేకపోయాను మను ముందు ఈ మార్గదర్శకాన్ని మరింత మెరుగు పరుచుటలో నా సహకారం ఉంటుంది. ఉబుంటు వాడుకరి మార్గదర్శిని యొక్క డౌన్లోడు లింకును నేరుగా టపాలో జతచేసివుంటే చదువరులకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఈ డైరెక్టు డౌన్లోడు లింకును ఇక్కడ ఉంచుతున్నాను టపాలో చేరిస్తే మరీమంచిది.

http://upload.wikimedia.org/wikipedia/commons/f/fc/UbuntuUserGuideTeluguEbook.pdf

ధన్యవాదములు,
Praveen Illa.

Arjun said...

ధన్యవాదాలు. పుస్తకం బొమ్మ క్రింద వివరణ పాఠ్యంలో లింకు ఇచ్చాను.

spveerapaneni said...

కొత్తవారికి చాలా ఉపయేగపడుతుంది.
ధన్యవాదములు,